
మన జీవితాలను కూల్చేది బయట ఉన్న సమస్యలు కాదు… మనలో ఉన్న “I” (నేను)
- Elisha Bonnke
- Feb 16
- 1 min read
మన జీవితాలను కూల్చేది బయట ఉన్న సమస్యలు కాదు… మనలో ఉన్న “I” (నేను)
మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు మనం సాధారణంగా:
కుటుంబం
పరిస్థితులు
మనుషులు
శత్రువులు
మీద నింద వేస్తాం ?
కానీ వాక్యము చెబుతోంది -
మన జీవితాన్ని ఎక్కువగా నాశనం చేసేది బయట ఉన్నవారు కాదు,
మనలో ఉన్న “నేను” (I).
సృష్టిలో –“నేనుతోనే” సమస్య మొదలైంది..
లూసీఫర్ మాటలు:
“నేను ఆకాశమునకు ఎక్కుదును
నేను నా సింహాసనాన్ని స్థాపించుదును
నేనే అత్యున్నతునివలె ఉండుదును”
(యెషయా 14:13–14),
నేను… నేను… నేను…
అదే అతని పతనానికి కారణం, దేవుని ముందు “నేను” నిలబడిన క్షణమే పతనం మొదలవుతుంది.
ఈ రోజుల్లో మందిరాలలో, కుటుంబాలలో కూడా ఉన్నది అదే...
నేను చెప్పిందే సరైనది,
నాకే అనుభవం ఉంది
నాకే జ్ఞానం ఉంది,
నన్నే అడగాలి...
ఇలాంటి మాటలు "నేను" అనే స్వభావంలో వినపడుతున్నాయి.
దీనివలన:
ఆత్మీయత పోతుంది
వినయం పోతుంది
విధేయత పోతుంది
ఇది చాలా భయంకరమైన స్థితి.
చాలామంది, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, మందిరాలకు వెళ్తారు
కానీ జీవితాన్ని నడిపేది మాత్రము నేను అన్న స్వభావం

అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన లోతైన ఆత్మీయ సత్యం
“జీవించువాడను నేను కాను,
క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.”
(గలతీ 2:20)
ఇది ఒక మరణ ప్రకటన
ఇది ఒక పరివర్తన రహస్యం, నేను చనిపోయాను, నా అభిప్రాయం చనిపోయింది, నా ఇష్టం చనిపోయింది, నా గర్వం చనిపోయింది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు
“నేను” చనిపోతేనే మార్పు మొదలవుతుంది.
“నా జీవితం ఎందుకు మారడం లేదు?” అన్న ప్రశ్న ఉంటే జవాబు చాలా సింపుల్:
“నేను” అన్నది ఇంకా బ్రతికే ఉంది గనుక.
యేసు ప్రభువు మనకు చూపించిన మాదిరిని గమనించండి:
ఆయనలో శక్తి ఉంది, అధికారం ఉంది, దేవత్వం ఉంది, అయినా...
“నా యిష్టము కాదు,
నీ చిత్తమే సిద్ధించునుగాక”
(లూకా 22:42)
ఇదే నిజమైన ఆత్మీయ జీవితం.
ఇదే పరలోక విజయ రహస్యం.
"I" (నేను) ఉన్న చోట:
పోటీ
అసూయ
విభేదాలు
గర్వం
దేవునికి మహిమ లేదు
"I" చనిపోయిన చోట:
ప్రేమ
సమాధానం
ఐక్యత
వినయం
చివరిగా ఒక ప్రశ్న:
నీ జీవితాన్ని నడుపుతున్నది ఎవరు?
-Elisha Bonnke

Comments