యేసు చూచినట్లుగా మనము చూడగలిగితే..
- oelishabonnke
- Nov 16, 2024
- 2 min read
డి.ఎల్ మూడీ గారు బలముగా వాడబడుతున్న దినాలలో జరిగిన సంఘటన ఇది.
బ్రిటన్లో జరుగుతున్న సభలలో ప్రసంగికులుగా హాజరైన డి.ఎల్ మూడీ గారిని చూడడానికి బ్రిటన్లో గొప్ప దైవజనులైన వారు కొందరు వచ్చారు. అంతగా చదువు లేని ఈ వ్యక్తి ఇంత బలముగా వాడపడుటకు రహస్యము ఏమిటో తెలుసుకోవాలని వచ్చిన వారు ఆశపడ్డారు.
ఆ దైవజనులందరూ డి.ఎల్ మూడీ గారితో పాటు ఒక హోటల్లో ఉన్నప్పుడు మూడీ గారితో వారు పరిచర్య వివరాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ హోటల్ కిటికీలో నుండి బయట పార్కులో కొంతమంది ఆడుకుంటున్న మనుష్యులు కనిపిస్తున్నారు. మూడీ గారు ఆ దైవజనుల్లో ఒక ముగ్గురికి బయట పార్కులో మీకు ఏమి కనబడుతుంది అని ప్రశ్న వేసారు. ఆ ముగ్గురు వ్యక్తులు సంతోషముతో పార్కులో ఆడుకుంటున్న వ్యక్తులు యొక్క ఆనందము కోసము మాట్లాడుతుండగా, కిటికీ పక్కన నిలబడిన డిఎల్ మూడీ గారి కళ్ళలో నుండి కన్నీరు కారుతుంది. అది గమనించిన ఒక దైవజనుడు మూడీ ఏమి జరిగింది ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు, మూడీ గారు మీకు ఆ పార్కులో ఆనందముతో గడుపుతున్న మనుష్యులు కనబడుతున్నారు నాకు యేసుక్రీస్తును పొందుకోకుండా నశించుచున్న వ్యక్తులు కనబడుతున్నారు అని ఏడ్చుచు ఆ దైవ భారమును వ్యక్తపరిచారు.
అక్కడికి వచ్చిన ఆ దైవజనులు మూడీ గారి యొక్క సేవ రహస్యము ఏమిటో ఆయన హృదయ భారములో గుర్తించగలిగారు.
ఒక దైవజనుడు చెప్పిన ఒక గొప్ప మాట..
యేసు చూచినట్లుగా మనము చూడగలిగితే.. యేసు చేసినట్లుగా మనము చేయగలుగుతాము.*
పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు నశించుచున్న ఆత్మల కొరకు వ్యక్తపరిచిన బాధను జ్ఞాపకం చేసుకుందాం.
రోమీయులకు 9:1 - 3
నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.
క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు.
పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు చెప్పిన ఒక మాటను చూడండి.
అపో.కార్యములు 20:31
కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.
మూడు సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు కార్చిన అనుభవమును పౌలు వ్యక్తపరిచారు.
అవును ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు.
యెషయా 66:8
అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా ?
మరి ఒక ప్రశ్న ?
మనము ఏ విధముగా చూస్తున్నాము ?
మనము దేవుని ఏ విధముగా వేడుకుంటున్నాము?
సామెతలు 24:11
చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?
Elisha Bonnke


Comments