స్ట్రెస్ (Stress) - ఒత్తిడి

స్ట్రెస్.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పదం. 70 సంవత్సరాల క్రితం ఈ పదం ఎవరికీ పెద్దగా పరిచయం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ పనులలో భాగంగా వంతెనలు, పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు జరుగుతున్న సమయంలో, ఒకదాని మీద మరొకటి బరువులు పడటం వలన వారు తరచుగా వాడిన పదం 'ఈ పని స్ట్రెస్ (stress) అవుతుందని'. అప్పటినుండి ఆ పదం ప్రాచుర్యం చెందుతూ, మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక, ఆరోగ్య, ఆర్థిక, మానవ సంబంధాల చింతలకు కూడా ఈ 'స్ట్రెస్' అనే పదం వాడుకలోనికి వచ్చింది.
ఐర్లాండ్లో ఒక చర్చికి బిషప్ గా పనిచేసిన రాబర్ట్ గారు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఎక్కువగా ఏదో ఒక చింతకు గురవుతూ ఉండేవాడినని చెప్పారు. దానిలో భాగంగా కాళ్లు బాగానే ఉన్నా, ఆరోగ్యం బాగానే ఉన్నా "ఏదో ఒకరోజు నాకు పక్షవాతం వచ్చి రెండు కాళ్లు పనిచేయకుండా పోతాయి" అన్న చింతలోకి ఆయన వెళ్ళిపోయారట. ఆయన అనేక సందర్భాలలో కూర్చున్నప్పుడు తన కాళ్ళను గిచ్చి చూసుకునేవారట, కాళ్లు పనిచేస్తున్నాయా లేదా పక్షవాతం వచ్చేసిందా అని. దానికి అలవాటు పడిపోయిన ఆయన, ఒకరోజు ఒక డిన్నర్ లో పక్కన ఉన్న వారితో కలిసి కూర్చున్నప్పుడు, 'ఒకసారి నా కాళ్లు చెక్ చేసుకుందాము' అన్న భావనతో గిచ్చి చూడగా ఆయనకు స్పర్శ ఏమీ తెలియలేదట. వెంటనే ఆయన కంగారుగా, "నేను ఎప్పటినుండో ఊహిస్తున్నట్టుగానే నాకు పక్షవాతం వచ్చేసింది, ఇక నా కాళ్ళు పనిచేయవు" అని కేకలు వేస్తుండగా... పక్కనే ఉన్న ఒక వృద్ధురాలు "బిషప్ గారూ! మీరు నా కాళ్లను గిచ్చారు, అవి మీ కాళ్లు కావు" అని చెప్పారట.
ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో, అనేక చింతలతో సతమతమవుతున్న వారు ఎంతోమంది మన మధ్య ఉన్నారు.

యేసుప్రభువు తన మొట్టమొదటి ప్రసంగంలో "దేనిని గూర్చియు చింతింపకుడి" అని నొక్కి చెప్పడానికి గల కారణం ఏమిటో మనం గమనిద్దాం. చింతించడం వలన అనేక విధములైన రోగములు, మానసిక సమస్యలు, ఓటములు, ప్రాముఖ్యంగా విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితి కూడా ఏర్పడతాయి. అందుకే మన ప్రియ ప్రభువు యేసయ్య చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది.
మత్తయి 6:25 - 28
అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
దేవుని పిల్లలముగా దేవుడు మనకు ఇచ్చిన భరోసా ఎంతో గొప్పది. ఇంతటి గొప్ప దివ్యవాక్కును పొందుకున్న మనం చింతకు చోటు ఇస్తే మనమే నష్టపోతాము. గనుక అనుదినము మన భారం భరించుచున్న మన దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి సమస్త చింతల నుండి బయటకు వద్దాము. సమాధాన, సంతోషకరమైన జీవితంలో ముందుకు సాగుతూ ప్రభువు కొరకు సాక్షులుగా బ్రతుకుదాము.
ఫిలిప్పీ 4:6 దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.




Comments