మునిగే పరిస్థితుల్లోనూ మునిగిపోని జీవితం

ఒక సామాన్య మహిళ మూడుసార్లు మృత్యుంజయురాలై నిలిచిన అద్భుతమైన వాస్తవం చరిత్ర పుటల్లో నమోదైంది.
1887లో అర్జెంటీనాలో జన్మించిన వైలెట్ కాన్‌స్టాన్స్ జెస్సప్, బాల్యం నుంచే మృత్యువుతో పోరాడారు. చిన్నతనంలోనే క్షయవ్యాధి సోకి, వైద్యులు ఆమె బ్రతకడం అసాధ్యమని చేతులెత్తేసినా అద్భుతంగా కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రసిద్ధ ‘వైట్ స్టార్ లైన్’ నౌకాయాన సంస్థలో స్టీవర్డెస్ మరియు నర్సుగా చేరారు. ఆ విధి నిర్వహణలో ఆమె ఎదుర్కొన్న మూడు వరుస మహా విపత్తులు చరిత్రలోనే అపూర్వం.
👉 1911లో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నౌకల్లో ఒకటైన ‘ఒలింపిక్’, బ్రిటిష్ యుద్ధనౌక ‘హెచ్‌ఎమ్‌ఎస్ హాక్’ను ఢీకొట్టి తీవ్రంగా దెబ్బతింది. భారీ ప్రమాదం జరిగినప్పటికీ, వైలెట్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
👉 1912లో "ఈ నౌకను దేవుడు కూడా ముంచలేడు" అని మనుషులు విర్రవీగిన టైటానిక్, తన మొదటి ప్రయాణంలోనే మంచుకొండను ఢీకొని జలసమాధి అయ్యింది. గడ్డకట్టే చలి, అంతులేని చీకటి, 1,500 మందికి పైగా జలసమాధి అవుతున్న ఆ భయానక దృశ్యంలో... ఒక పసికందును గుండెలకు హత్తుకుని 16వ నంబర్ లైఫ్‌బోట్ ద్వారా ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
👉 1916లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఆసుపత్రి నౌకగా మారిన బ్రిటానిక్, ఏజియన్ సముద్రంలో మైన్‌ను ఢీకొని పేలిపోయింది. కేవలం 55 నిమిషాల్లోనే ఆ మహా నౌక మునిగిపోతుండగా, లైఫ్‌బోట్లు నౌక ప్రొపెల్లర్ రెక్కల్లో చిక్కుకుని ముక్కలవుతున్న భయానక తరుణంలో ఆమె నీటిలోకి దూకేశారు. తలకు తీవ్ర గాయమైనప్పటికీ, ఆమె మళ్లీ ప్రాణాలతో ఒడ్డుకు చేరారు.
ఒకే తరగతికి చెందిన మూడు భారీ నౌకలు ప్రమాదానికి గురైనా, చావు అంచులను చూసి వచ్చిన ఆమెను చరిత్ర ‘మిస్ అన్‌సింకబుల్’ (మునగని నారి) అని గౌరవంగా పిలిచింది.
అన్ని విపత్తుల మధ్య సాగిన ఆ జీవితము గురించి విన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం గుర్తుకు వచ్చింది.
యోబు గ్రంథం 5:19లో
"ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు."
అలాగే కీర్తనలు 34:19లో మనకు అందరికీ పరిచయమైన మాట...
"నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును."

నీతిమంతుడైనంత మాత్రాన జీవితంలో తుఫానులు రావని, సముద్రాలు అల్లకల్లోలం కావని వాక్యం చెప్పడం లేదు. బాధలు ఆరు రావచ్చు, ఏడు ఎదురుకావచ్చు; ఆపదలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి రావచ్చు. ఒలింపిక్ వంటి కష్టం దాటిందనుకునే లోపే టైటానిక్ వంటి పెనుముప్పు ముంచెత్తవచ్చు... అది దాటినా బ్రిటానిక్ వంటి అగ్నిపరీక్ష ఎదురునిలవవచ్చు.
కానీ దేవుని ఇస్తున్న అత్యున్నత భరోసా ఏమిటంటే ఆపదల ఉనికి ఎంత నిజమో, దైవిక విమోచన అంతే నిశ్చయం!
ఈ లోకంలో ధనవంతుల ఓడలు మునిగిపోవచ్చు, బలవంతుల సాధనాలు బద్దలైపోవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడిన నీతిమంతుని కోసం ఆయన ప్రతి శోధనలోనూ ‘సహించగలుగుటకు తప్పించుకొను మార్గమును’ కలుగజేస్తాడు (1 కొరింథీ 10:13). ప్రయాణిస్తున్న నౌక మునిగిపోయినా, ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు ఒక చిన్న లైఫ్‌బోట్‌నైనా సిద్ధపరుస్తారు.
బాధల పరిమాణం ఎంత పెద్దదన్నది ముఖ్యం కాదు, వాటి మధ్యలో నిన్ను దాచే దేవుని కృప ఎంత అగాధమైనదన్నదే సత్యం. పరిస్థితులు తలకిందులై, కళ్ళముందు ఆధారాలన్నీ మునిగిపోతున్నట్లు కనిపించినా అధైర్యపడవద్దు. ఎన్ని తుఫానులు చుట్టుముట్టినా నీ జీవన నావ ఎప్పటికీ మునిగిపోదు; ఎందుకంటే ఆ తుఫానులను శాసించే సర్వశక్తిమంతుడు నీ పక్షాన ఉన్నాడు.




Comments