ఆచారములు
- Elisha Bonnke
- Jan 16
- 2 min read
చాలా సంవత్సరముల క్రితం అమెరికాలో జరిగిన నిజ సంఘటన ఇది.
జోన్స్ అనే ఒక ట్రక్ డ్రైవర్ భార్యకు, ఒక వ్యక్తి ఫోన్ చేసి జోన్స్ నేను డాక్టర్ జాన్సన్ మాట్లాడుతున్నాను, మీ భర్త అకస్మికముగా ఇక్కడ అనారోగ్యంతో పడిపోయారు, అతనిని మేము పరీక్షించగా అతనికి ఒక వింతైన వ్యాధి ఉన్నట్లు గుర్తించాము, అతను కోలుకొనుటకు మూడు నెలల సమయం పడుతుంది, ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నారు, ఆ వ్యాధి ఒకవేళ మీకు కూడా సోకి ఉండొచ్చు.
తక్షణమే మీరు మీ తల వెంట్రుకలను కత్తిరించి తొలగించండి, తొలగించిన వెంట్రుకలను మేము పరీక్షకు తీసుకుంటాము ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పడంతో, ఈ మాట విన్న ఆమె భయముతో వెంటనే అందుబాటులో ఉన్న పరికరములతో తన తల వెంట్రుకలను మొత్తం తొలగించింది. ఈ ప్రాసెస్ జరిగినంత వరకు ఫోన్ చేసిన వ్యక్తి లైన్ లోనే ఉన్నారు.
జోన్స్ అతనితో నేను నా తల వెంట్రుకలను మొత్తం తీసేసాను ఇప్పుడు ఏమి చేయమంటారు, అని అడిగిన వెంటనే అతడు ఇచ్చిన జవాబు మీరేమీ చేయొద్దు ఒక 15 నిమిషాలు ఉంటే మీ భర్త ఇంటికి వచ్చేస్తారు, నేను మీతో చెప్పిందంతా అబద్ధమని చెప్పాడంట, ఇలాంటి మోసపూరితమైన సంఘటనలు మనము వింటూ ఉంటాం కదా.
ఇందులో మనము గమనించవలసింది, మనకు ఏదో జరిగింది ఏదో జరగబోతుంది అని ఎవరైనా చెప్పి ఇలాంటి బాహ్య సంబంధమైన పనులు చేయమన్నప్పుడు చేయడానికి సిద్ధపడిపోతాం కదా.
సాతాను సంబంధమైన మనుష్యులు అనేకులను ఇటువంటి భ్రమలోనికి పెట్టి మోసం చేస్తున్నారు దానిలో భాగముగా ఎన్నో ఆచారాలు ప్రవేశపెట్టారు.
పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండము 32 వ అధ్యాయములో అంతవరకు దేవుని చేత నడిపింపబడిన మనుష్యులు మోసం చేయబడ్డారు.
ఆ ప్రజలను నడిపిస్తున్న దేవుని సేవకుడైన మోషే ఆ ప్రజల కోసమై సీనాయి కొండమీద దేవునితో ఉండగా, కొండ దిగువన ఉన్న వారు కొద్ది దినములు ఎదురుచూసి కొండమీద నుండి మోషే రాకపోవడంతో ఒక రూపమును చేసి ఇదే దేవుడు అన్న ఆచారమును సృష్టించుకున్నారు.
నిర్గమకాండము 32:1
మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
ఈ ఆలోచను అనుసరించి మోసపోయిన ఇశ్రాయేలీయులు 3,000 మంది కూలిపోయారు.
నిర్గమ 32:28
ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి.
“దేవుడు చెప్పింది కాకుండా, అనిపించినది చేయడమే” లోకాచారం. ఈ ఆచారములు బాహ్య సంబంధమైన శుభ్రం మీద, బాహ్య సంబంధమైన సంతోషాల మీద, బాహ్య సంబంధమైన పవిత్రతల మీద ఆధారపడి ఉంటాయి.
అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు/వాక్యములు మనకు నిజమైన శుభ్రతను, నిజమైన సంతోషమును, క్షేమకరమైన ఆనందమును, నిజమైన పవిత్రతను అనుగ్రహించును.
మార్కు 7:8, 9
మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.
మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.
ఆచారములు దేవుని ఆజ్ఞకు విరోధముగా పనిచేస్తూ మనుషులను పై పై సంతోషాలతో మోసం చేస్తున్నాయి.
నిజమైన ఆనందము, నిజమైన విజయము, నిజమైన సమాధానము దేవుని వాక్యములోనే ఉన్నది
గనుక వాక్యమునే మనము అనుసరించాలి తప్ప ఆచారములను కాదు. వాక్యములో దేవత్వము ఉన్నది, ఆ వాక్యమే క్రీస్తుగా శరీరధారియై మన మధ్యకు దిగి వచ్చింది.
కొలస్సీ 2:9
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
దైవత్వం ఉన్న దగ్గరే నిజమైన పండుగ.
*గనుక* ..
1) జాగ్రత్తగా ఉండుడి
క్రీస్తు దేవత్వము నుండి దూరం చేసే విషయాలను బట్టి జాగ్రత్తగా ఉండుడి. కొలస్సీ 2:8
2) ఉండకుడి
క్రీస్తు దేవత్వము నుండి దూరం చేసే విషయాలతో జోడుగా ఉండకుడి. 2కోరింథీ 6:14
3) ప్రత్యేకంగా ఉండుడి
క్రీస్తు దేవత్వము నుండి దూరం చేసే విషయాలకు ప్రత్యేకముగా ఉండుడి. 2కోరింథీ 6:17
4) ముట్టకుడి
క్రీస్తు దేవత్వము నుండి దూరం చేసే విషయాలను ముట్టకుడి. 2కోరింథీ 6:17
5) పారిపోవుడి
క్రీస్తు దేవత్వము నుండి దూరం చేసే విషయాలకు దూరముగా పారిపొవుడి. 2కోరింథీ 10:14
జాగృతి గలవారమై దేవుని చిత్తములో మనము ఈ లోకమునకు అతీతంగా భద్రపరచబడాలి.
-Elisha Bonnke




Comments