యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నారు
- Elisha Bonnke
- Feb 5
- 2 min read
ప్రపంచ సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన కవి Alfred Lord Tennyson (1809–1892).
ఆయన కేవలం గొప్ప కవే కాదు, లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తి కూడా.
ఒకసారి ఆయన తన స్నేహితునితో కలిసి ఒక తోటలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. చుట్టూ ప్రకృతి ప్రశాంతంగా ఉంది, వికసిస్తున్న పుష్పాలు, సూర్యకాంతి, నిశ్శబ్ద వాతావరణం.
ఆత్మీయ సంభాషణలకు అనుకూలంగా ఉన్న ఆ క్షణంలో వారు అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగారు.
తన స్నేహితుడు ఒక సాధారణంగా అనిపించే లోతైన ప్రశ్న లార్డ్ టెన్నిస్న్నీ గారిని అడిగాడు:
“యేసుక్రీస్తు గూర్చి నీవు ఏమి అనుకుంటున్నావు ?”
Alfred Lord Tennyson వెంటనే తర్కంలోకి వెళ్లలేదు, ఉపన్యాసం ఇవ్వలేదు.
కానీ అక్కడ వికసిస్తున్న ఒక పుష్పాన్ని చూపిస్తూ ఈ విధంగా సమాధానం చెప్పాడని చెప్పబడుతుంది:
“What the sun is to that flower, Jesus Christ is to my soul.”
ఆ పుష్పానికి సూర్యుడు ఏమై ఉన్నాడో, నా ఆత్మకు యేసుక్రీస్తు కూడా అదే.
ఆయన చెప్పిన ఈ మాట quotesలో ఎక్కువగా ప్రాచుర్యం చెందింది.
ఈ చిన్న మాటలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. సూర్యుడు లేకపోతే పుష్పం వికసించదు, వేడి లేకపోతే దాని జీవం నిలబడదు.
అలాగే మన జీవితాల్లో యేసుక్రీస్తు లేకపోతే ఆత్మకు నిజమైన జీవం, దిశ, ఆశ ఉండదు.
ఇక్కడ మనకు ఒక ప్రశ్న:
యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నారు?
యేసుక్రీస్తే మనకు సత్యమయితే...
మన నిర్ణయాలు మారతాయి,
ఇప్పటివరకు మనకు నచ్చినదే సరైనదనుకున్న మనం ఇక దేవునికి నచ్చినదే సత్యమని ఎంచుకుంటాం.
ఆయనే మనకు వెలుగయితే...
మన చీకట్లు తొలిగిపోతాయి.
భయాలు, సందేహాలు, అపరాధ భావాలు
ఆ వెలుగులో నిలబడలేవు.
ఆయనే మనకు జీవమయితే...
మన ఆత్మ వికసిస్తుంది, ఎండిపోయిన విశ్వాసంలో ఆశ చిగురిస్తుంది, అలసిపోయిన హృదయానికి కొత్త బలం లభిస్తుంది.
ఆయనే మన మార్గమయితే...
మన గందరగోళానికి ముగింపు వస్తుంది, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు సాగాలో
మనలను ఆయనే నడిపిస్తాడు.
ఆయనే మనకు ప్రేమయితే...
మన స్వభావమే మారిపోతుంది, క్షమించలేని మనం క్షమించగలుగుతాం,
తీర్పు చెప్పిన చోట కరుణ ప్రవహిస్తుంది.
Alfred Lord Tennyson ఒక పుష్పాన్ని చూపించి చెప్పిన ఆ మాటలు ఈ రోజు మనకు ఒక సవాళుగా నిలుస్తున్నాయి.
యేసుక్రీస్తు మన జీవితంలో ఒక పేరు మాత్రమేనా?
లేదా మన ఆత్మకు వెలుగా?
సూర్యుడు పుష్పాన్ని వికసించమని బలవంతం చేయడు, అతని సమక్షంలో ఉంటే చాలు వికాసం సహజంగా జరుగుతుంది.
అలాగే, యేసుక్రీస్తు సమక్షంలో ఉన్న జీవితం యొక్క మార్పు ప్రయత్నంగా కాకుండా
ఫలవంతముగా కనిపిస్తుంది.
చివరిగా :
నా ఆత్మకు యేసుక్రీస్తు నిజంగా వెలుగై ఉన్నారా?
నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. యోహాను 8:12.
-Elisha Bonnke




Comments