ఎందుకు మనలను అపజయాల గుండా నడిపిస్తాడు?
- Elisha Bonnke
- Feb 27
- 2 min read

బైబిలులో మోషే, యోసేపు, దానియేలు, దావీదు వంటి దేవుని సేవకులు ముందుగా అపజయాలు, నిరాశలు, శ్రమలు అనుభవించి, తరువాత దేవుని చేత గొప్ప విజయాలను పొందుకున్నారు.
అలాగే చరిత్రలో విలియమ్ కేరి, థామస్ ఎడిసన్ వంటివారు కూడా అనేక అపజయాల గుండా నడిచి, చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించారు.
అయితే ఒక ప్రశ్న మనలో వస్తుంది
దేవుడు ఎందుకు మన జీవితాలలో అపజయాలను అనుమతిస్తాడు?
దానికి కొన్ని ముఖ్యమైన కారణాలను జ్ఞాపకం చేసుకుందాం.
దేవుడు అపజయాలను ఎందుకు అనుమతిస్తాడు?
1) మనలను దీనులుగా చేయుటకు...
ఎల్లప్పుడూ విజయాలే వస్తే గర్వం పెరుగుతుంది.
అపజయాలు మన హృదయాన్ని దేవుని ఎదుట విధేయతలో నిలబెడతాయి.
2) మనలను జ్ఞానులుగా చేయుటకు...
ఓడిపోయిన తర్వాత “ఇంకా మెరుగ్గా చేయాలి” అన్న తపన మనలో పుడుతుంది, అపజయము జ్ఞానానికి ద్వారం.
3) మనలను కనికరము గల వారిగా చేయుటకు...
కష్టాల గుండా విజయాన్ని పొందినవారు ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకుంటారు, అపజయాలు మన హృదయాన్ని కనికరంతో నింపుతాయి.
4) సలహాదారులుగా తయారు చేయుటకు... అపజయాల గుండా వెళ్లినవారు ఓటమిలో ఉన్నవారికి సరైన మార్గదర్శకులుగా నిలబడగలరు.
5) ఆదరణ కలిగించే వారిగా చేయుటకు...
బాధలు అనుభవించినవారికే తెలుసు ఆదరణ ఎంత విలువైనదో. కాబట్టి అనేక బాధలలో ఉన్న వారిని వారే ఆదరించగలరు
అపజయాల తరువాత విజయం పొందినవారు
40 సంవత్సరాల తర్ఫీదులో మోషే,
13 సంవత్సరాల కష్టాలలో యోసేపు,
15 సంవత్సరాలు తరుమబడిన దావీదు,
బబులోను చెరలో దానియేలు వంటివారు మరియు ఎస్తేరు వంటివారు
వీరందరూ వారి అపజయాలలో అనేకమైన అనుభవాలను పొందుకొని గొప్ప విజయాలను చూసారు, వారు పొందిన విజయాలలో గర్వం లేదు.
వారు దీనులుగా, సలహాదారులుగా, ఆదరించువారుగా, ధైర్యము చెప్పువారుగా అనేక మందికి మార్గదర్శకులు అయ్యారు.
ఈ అన్నిటి వెనుక దేవుని అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంది.
యాకోబు 1:13
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు, “నేను దేవుని చేత శోధింపబడుచున్నాను” అని అనకూడదు.
1 పేతురు 1:7
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును.
2 కోరింథీ 1:4
దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.

అపజయం అంతం కాదు, అది దేవుని చేతిలో ఒక శిక్షణ.
ఈ రోజు నీవు అపజయంలో ఉన్నావా?
దేవుడు నిన్ను రేపటి గొప్ప సేవకు సిద్ధం చేస్తున్నాడని నమ్ము.
-Elisha Bonnke




Comments