కింగ్ కోబ్రా తీసుకున్న జాగ్రత్త..
- oelishabonnke
- Nov 21, 2024
- 1 min read
ప్రపంచములో భయంకరమైన విషసర్పముగా పిలవబడుతున్న కింగ్ కోబ్రా తన పిల్లలను కనినప్పుడు ఆ పిల్లలను 60 నుండి 90 దినములవరకు చాలా జాగ్రత్తగా కాపాడి ఆ పిల్లలు నడవగలిగిన రూపమునకు రాగానే వాటిని దూరంగా విడిచిపెట్టి వాటి నుండి వెళ్లిపోతుందంట. కారణం కోబ్రాకు సహజముగ పాములను తినే అలవాటు ఉంది ఒకవేళ తన పిల్లలను తానే తినేస్తానేమో అన్న భయంతో దూరముగా పారిపోతాయి.
ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంధం నుండి ఒక మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. 1కోరింథీ 10:12తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
అబ్రహాము నిలుచుచున్న సమయములో, విశ్వాసములో ఎదుగుచున్న సమయములో, దీవించబడుతున్న సమయములో.. ఐదుగురు రాజులు సాధించలేని గొప్ప విజయమును సాధించాడు. విజయమును పొందుకొని తిరిగి వస్తున్న సమయములో అబ్రహాముకు అభినందిస్తూ సోదోమరాజు ఇస్తున్న ఆస్తులను తిరస్కరించి దేవుడు తన కొరకు దాచియుంచిన ఉన్నతమైన ఆశీర్వాదములు కొరకు తన ముందుకు వచ్చిన అవకాశములను వద్దునుకున్నాడు వాటిని దూరముగా పెట్టాడు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు కాకుండా దేవుడిచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదములుకు వారసుడు కాగలిగాడు.
దైవజనుడైన ఎలీషా దేవుని నామమున చేసిన అద్భుతమునకు తగిన కృతజ్ఞతగా నయమాను కానుకలను పంపినా.. ఎలీషా వాటిని దూరముగా ఉంచగలిగాడు.
దావీదు తనను తరుముతున్న సౌలు తన చేతికి చిక్కినా, అభిషేకింపబడినవానిని చంపకూడదనే దేవుని చిత్తమును ఘనపరచి ఆ చెడు ఆలోచనకు దూరముగా ఉండగలిగాడు.
బైబిలులో ఉన్న భక్తులందరూ ఈ విధముగా జాగ్రత్త వహించడమును బట్టి గొప్పదేవుని ఘనమైన పిల్లలుగా ప్రజ్వలించబడగలిగారు.
గనుక ..
మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. హెబ్రీ12:15, 16.
Elisha Bonnke


Comments