జీవితములో విజయం సాధించాలి అంటే...
- oelishabonnke
- Nov 12, 2024
- 2 min read
సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చిన ఒక మనవడు తన తాతయ్యను ఒక ప్రశ్న అడిగాడు, తాతయ్య జీవితంలో పైకి రావాలి ఏమి చేయాలి అని.
తన మనవడు వేసిన ఆ ప్రశ్నకు చిన్న చిరునవ్వు నవ్వి ముందు మనము నర్సరీకి వెళ్లి మన ఇంటిలో నాటుటకు కొన్ని మొక్కలు కొందాము అని చెప్పి ఇద్దరూ నర్సిరీకి వెళ్లి ఒక రెండు మొక్కలను కొని తెచ్చారు.
తెచ్చిన మొక్కలను ఒకటి కుండీలో పెట్టి ఇంటిలోపల ఒక స్థలములో ఉంచారు మరొక మొక్కను బయట నేలలో నాటారు.
అప్పుడు తాతయ్య చెప్పాడు నీవు మరలా సెలవులకు మన ఇంటికి వస్తావు కదా అప్పుడు జీవితములో ఎదుగుటకు ఏమి చేయాలి అని నీవు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాను అని ఆ బాలునితో చెప్పాడు.
సెలవు దినములు ముగియగానే తన తాత ఇంటి నుండి వెళ్లిన ఆ బాలుడు ఆరు నెలల తర్వాత మరలా తాతయ్య ఇంటికి వచ్చాడు. వచ్చిన ఆ బాలుడు తాతయ్యతో కలసి నాటిన మొక్కలను పరిశీలించినప్పుడు ఇంటిలో ఉన్న మొక్క కుండీలో పచ్చగా చిన్నగా ఉంది దానిలో ఏ ఫలములు లేవు ఎదుగుదలలేదు ఆయితే బయట వేసిన మొక్క ఎలా ఉంటుందో అని బయటికి వెళ్లి చూసినప్పుడు అది బయట కనబడక పోయేసరికి తాతయ్యని అడిగాడు ఆ మొక్క ఏదని.
తాతయ్య నవ్వుతూ ఇప్పుడు అది మొక్క కాదు చెట్టు, నీవు క్రింద కాదు పైన చూడు ఎంత పెద్ద చెట్టో అని చెప్పినప్పుడు ఎత్తుగా ఎదిగిన చెట్టును చూచి ఆశ్చర్యపడ్డాడు ఆ బాలుడు.
అప్పుడు తాతయ్య చెప్పారు నీవు ఇంతకుముందు నన్ను అడిగావు కదా జీవితములో పైకి రావాలి అంటే ఏమి చేయాలని.
ఇంటిలో ఉన్న మొక్కకు ఏ కష్టము లేదు, ఏ ఆటుపోటులు లేవు, ఈ తుఫాను ప్రభావములు లేవు, అనుదినము దాని కాళ్ల దగ్గరకు నీరు వస్తుంది.
కాని బయట ఉన్న మొక్క ఎండా, తుఫానులు, రకరకాల ఆటుపోటులు, విపత్తులు స్వతహాగా భూమి నుండి నీరును స్వీకరించే తత్వము కలిగిన అనుభవములో ఉంది గనుక ఇంటిలో ఉన్న మొక్క కన్నా గొప్ప చెట్టుగా అది ఎదగలిగింది.
ఇందులో ఉన్న సత్యమును తెలిసిన మనము ఈ అంశమును ఆధారం చేసుకుంటూ మన ఆత్మీయ ఎదుగుదల విషయము కొరకు ఆలోచిద్దాం.
అపోస్తులుడైన పౌలు గారు తన ఎదుగుదలకు మూలమైన స్టేట్మెంట్ కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికలో 11వ అధ్యాయములో
సంఘమునకు ఇచ్చారు.
విశేషముగా ప్రయాసపడి సార్వత్రిక సంఘములో బలమైన వృక్షముగా ఎదిగిన అపోస్తులుడైన పౌలు గారి మాటలలో దానిని చూద్దాం.
2కోరింథీ 11:22 - 31
వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే, వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను.
మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.
ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.
ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది.
ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును.
నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
ఇంతగా ప్రయాస పడిన అపోస్తులైన పౌలు గారు ఎంత ఉన్నతముగా ఎదగారో మనమందరము చూసాం.
మరి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే చివరగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం.
1పేతురు 4:1
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి..
యోబు 8:5 - 7
నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన యెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును.
అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
Elisha Bonnke



Comments