top of page

దేవుడు కీర్తనీయుడు

Jan 17
2 min read

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈలాటిదా యేసు ప్రేమ అనే పాటలో నాలుగువ చరణము పనికిమాలిన వాడనైన - నేను

కనపరచు నా దోష కపటవర్తనము

మనసు నుంచక తాపపడక యింత

ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా యేసుప్రభు||.

కృతజ్ఞత రక్షణ ఆనందముతో ఈ పాటను రచించిన వారు రావూరి రంగయ్య గారు.

రావూరి రంగయ్య గారి తమ్ముడు పేరు రావూరి లక్ష్మయ్య. ఇద్దరూ చిన్న వయసులో ఉన్నప్పుడే వారి తండ్రి మరణించగా పిన తండ్రి అయిన లక్ష్మీ నరసయ్య గారు వారిని పెంచి పెద్దచేసారు.


వీరిలో చిన్నవాడైన లక్ష్మయ్య ముందుగా యేసును గూర్చిన సువార్తను విని రక్షింపబడ్డారు. రక్షింపబడిన తమ్ముడు అన్నకు సువార్తను చెప్పగా యేసును అంగీకరించినందుకు అన్న రంగయ్య తమ్ముని తృణీకరించారు.

లక్ష్మయ్య గారు యేసు ప్రేమను అన్నకు తెలియజేయాలనే ఉద్దేశముతో, "అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు..." అనే పాటతో యేసు ప్రేమ సువార్తను అందించారు. ఇంతగా వారి అన్న కొరకు భారము కలిగియుండగా

రంగయ్య గారు కొన్ని రోజులకు అనారోగ్యమునకు గురి అయ్యారు. అట్టి పరిస్థితుల్లో సువార్తను బట్టి తృణీకరింపబడిన తమ్ముడు లక్ష్మయ్య అన్న మంచం మీద ఉండగా ఎంతో పరిచర్య చేసి క్రీస్తు సువార్త ప్రేమతో ఆదరించినప్పుడు ఆ ఆదరణలో స్వస్థత పొందుకున్న అన్నయ్య రంగయ్య గారు యేసు నందు విశ్వాసముంచి "ఈలాటిదా యేసు ప్రేమ అనే పాటను రచించారు".

తరాలు మారుతున్నప్పటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రచించబడిన ఈ పాటలు సంఘములో వినబడుతూనే ఉన్నాయి.


ఆయా భక్తులు యొక్క పరిచర్యల నుండి వెలువడిన ఆత్మీయ గీతములను సమకూర్చి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలుగా పెద్దలు సమకూర్చారు.

నడిపించు నా నావా పాట యొక్క ఆత్మీయ లోతులు, మార్గము చూపుము ఇంటికి అనే పశ్చాత్తాప పాటలు, వందనంబొనర్తుమో ప్రభో ప్రభో అన్న కృతజ్ఞతతో కూడిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల ద్వారా మనకు అందించబడ్డాయి, అలాగే సీయోను గీతములు నుండి కూడా మనకు అనేక పాటలు, హోసన్న పరిచర్యలు నుండి అనేక పాటలు, ఇలా ఎంతోమంది భక్తుల యొక్క పాటలు వారీ ఆత్మీయ అనుభవాల నుండి మనకు అందించబడ్డాయి, అందించబడుతూఉన్నాయి.


పరిశుద్ధ గ్రంథములో కూడ భక్తులు రచించిన కీర్తనలు వారి కృతజ్ఞతలో నుండి, పశ్చాత్తాపంలో నుండి, ప్రభువు యొక్క ఔన్నత్యమును ఘనపరచుటలో నుండి వచ్చినవే. ఆ పాటలను భక్తులైన వారు ఇప్పటి పరిస్థితులకు అనుకూలముగా సమకూర్చగా మనం వాటిలో కొన్నింటిని పాడుకుంటున్నాము‌. యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం దావీదు రచించిన 118వ కీర్తన, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది 147వ కీర్తన నుండి, దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి 150 వంటి కీర్తనలు నుండి వచ్చిన పాటలను మనం ఇప్పటికీ పాడుకుంటున్నాము.


ఈ విధంగా ప్రభువుకు మహిమ తెచ్చే విధముగా మనము పాడుతున్న పాటలు, మనము చేస్తున్న ఆరాధనలు, మన వాయిస్తున్న సంగీతములు ఉండాలి అన్నమాటను జ్ఞాపకం చేసుకుందాం.


ఆత్మీయ అనుభవాలతో చాలామంది ప్రభువు మహిమార్ధమై పాటలు రచించి అందిస్తున్నారు, దేవునికి మహిమ కలుగును గాక!


నిజమైన పశ్చాత్తాపము, కృతజ్ఞత, సువార్త భారము, మంచి సాక్ష్యములలో నుండి వచ్చిన పాటలు ప్రభువుకు మహిమ, సంఘమునకు ఆశీర్వాదకరము.

ఏదో వ్రాయాలి కదా అని వ్రాసే పాటలు అప్పుడే కనబడి కనుమరుగవుతున్నాయి.


పాటలు వ్యక్తిగత సంతృప్తి కొరకు కాదు, దేవుని ఘనపరుచుటకు.

ఆరాధన మన కొరకు కాదు, దేవుని కొరకే.


కీర్తనలు 47:7

దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.


దేవునికి మహిమ కలుగును గాక!


-Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page