నేను నిన్ను చూస్తున్నాను
- oelishabonnke
- Nov 4, 2024
- 2 min read
పాశ్చాత్తా దేశంలో జరిగిన సంఘటన ఇది...
అక్కడ ఎక్కువగా భూకంపాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనుటకు వీలుగా వారి నివాస గృహములను ఎక్కువగా వుడ్స్ (చెట్లు యొక్క చెక్కలతో) నిర్మాణము చేసుకుంటారు. ఆ సంగతి చాలామందికి తెలిసిందే, ఆ గృహాలు ఎంతటి భద్రతవి అయినప్పటికీ అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు మొత్తం అంతా బూడిదమమయమైపోవలసిందే.
ఇది నిజముగా జరిగిన సంఘటన.
ఒకసారి ఒక గృహంలో అగ్ని ప్రమాదం జరిగింది.. ఆ అగ్ని మంటల్లో ఒక బాలుడు చిక్కుకున్నాడు, ఏమి చేయాలో తెలియక తప్పించుకునే మార్గము లేక ఆ గృహం యొక్క మిద్దె మీదకు వెళ్ళిపోయాడు, క్రింద నుండి విపరీతముగా మంటలు వస్తూ ఉన్నాయి, తప్పించుకునే మార్గము లేదు పైనుండి భయముతో కేకలు వేస్తూ ఉన్నాడు, విపరీతమైన అగ్ని మరియు పొగ వలన క్రింద ఎవరూ కనబడట లేదు, భయముతో కేకలు వేస్తూ ఉండగా క్రింద నుండి ఆ బాలుని యొక్క తండ్రి స్వరం వినబడుతున్నది, బాబు నువ్వు భయపడనవసరం లేదు, ఏమాత్రం ఆలోచించక నువ్వు ఉన్న స్థలముల నుండి ముందుకు దుమికై నేను నిన్ను పట్టుకుంటాను అని తండ్రి కేక వేస్తూ ఉన్నాడు, ఆ బాలునికి తండ్రి యొక్క పిలుపు వినబడుతుంది గాని పొగ విస్తారంగా విస్తరించినందున తండ్రి ఎక్కడ ఉన్నాడో కనబడుటలేదు, బాబు తండ్రితో, చెబుతున్నాడు డాడీ మీరు నాకు కనబడటం లేదు నేను ఎలా దూకగలను, తండ్రి చెబుతున్నారు నీకు నేను కనబడకపోయినప్పటికీ నువ్వు నాకు కనబడుతున్నావు దూకెయ్ అని కేక వేసినప్పుడు ఏమాత్రం సందేసింపక బాబు పైనుండి క్రిందికి దూకాడు క్రింది నుండి తండ్రికి కనబడుతున్న తన కుమారుడిని తండ్రి అందుకొని కాపాడగలిగాడు..
ప్రియమైన దేవుని బిడ్డలారా జరిగిన ఈ ఉదాంతంలో నుండి ఒక అద్భుతమైన సత్యము మనకు అర్థమవుతున్నది, పరిస్థితి మన చేతిలో లేనప్పుడు మన వలన కాదు అనుకున్నప్పుడు, ఇక అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు మనకు వినబడుతున్న దేవుని స్వరమును వినగలుగుతున్నామా?, దేవుని స్వరమును నమ్మగలుగుతున్నామా?. దేవుడు తన స్వరమును వినిపింపచేస్తూ ఉన్నారు, ఆ స్వరం దేవుడు మనకు ఇచ్చిన ఆయన వాక్యములో ఉంది.. ఆ వాక్కు మనకు అనేకసార్లు వినబడుతూనే ఉంది.. మనకు ఆయన కనబడ లేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ మనము ఆయనకు కనబడుతున్నాము.. గనుక విశ్వాసముతో ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే నిన్ను నడిపిస్తాను అనే ఒక గొప్ప భరోసాను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు.
ఈ సమయంలో మనము ఒకటి గమనిద్దాం మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనకు ఏ ఆధారము కనబడలేనప్పటికీ మనలను పరిశీలించుచున్న దేవుని దృష్టిలో మాత్రము మనము ఉన్నాము.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు వేస్తున్న కేక దేవుడు పలుకుతున్న స్వరమును మనము వినగలిగితే మనము బ్రతుకగలము..
యెషయా 55:3
చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
హెబ్రీయులకు 4:7
నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
అవును దేవుని స్వరం వినబడుతున్నది, మనమే స్పందించలేకపోతున్నాము, ఈ సమయంలో ఈ అంశము ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం వినగలుగుతున్నామా?
దేవుని వాక్యము వినగలిగిన వారు ధన్యులు, ఏ చింత భయము దిగులు దుఃఖము లేకుండా ధైర్యముగా వారు ముందుకు వెళ్ళగలరు..
దేవుని స్వరము వినే కృపలో మనమందరము ముందుకు సాగుదుము గాక!
Elisha Bonnke



Comments