వేదిక మీద సీనియర్...
- oelishabonnke
- Dec 4, 2024
- 2 min read
ఒకసారి ఒక దైవజనుడు తన 16వ ఏట సువార్త పరిచర్యలో భాగముగా ఒక సభలో ప్రసంగమునకు ఆహ్వానింపబడ్డారు. అదే సభలో మరొక ప్రసంగికుడు కూడా ఉన్నారు ఆయన వయసులో పెద్దాయన, ఆయన ఈ 16 సంవత్సరాల సేవకుని చూసి నాతోడి ప్రసంగికుడు అంటే వయసులో పెద్దవాడు అనుకున్నాను, కానీ ఇతనా వాక్యమును పంచుకుంటాడు అని చులకనగా చూసి, మొదటి ప్రసంగంలో చాలా సమయం వాక్యమునందించి తదుపరి ప్రసంగమునకు సమయమును తక్కువ చేసారు. తరువాత, పిలవబడిన యవ్వనస్తునికి ఒక పది నిమిషాలు మాత్రమే సమయమును ఇచ్చారు.
దేవునికి స్తోత్రం ఆ పది నిమిషముల సమయంలో పరిశుద్ధాత్మ కార్యము బహు బలంగా ఆ సభలో దేవుడు జరిగించారు.
చాలామంది నీలో ఉన్న తలాంతులు చూడరు, నీ వయసును చూస్తారు, సీనియారిటీని చూస్తారు, పై రూపమును చూస్తారు, వారి పేరు పోకుండా ఉండాలని కూడా చూస్తారు, నీవు బాగా వాడబడితే వారు తక్కువ అయిపోతారు కదా. తలాంతులేని వారిని సంతోష పెట్టడానికి తలాంతులు గలగవానిని కూడా పక్కన పెడతారు.
అయితే గుర్తుంచుకుందాం మీకు మనుష్యులు ఇచ్చే అవకాశంతో సంబంధము లేదు, దేవుడు నిన్ను ఎన్నుకుంటే మనుష్యులు నిన్ను పక్కన పెట్టిన దేవుడు ఏదో ఒక విధముగా తన కార్యమును నీ ద్వారా జరిగిస్తారు.
అందరికీ తెలిసిన సందర్భంలో దావీదును మనుష్యులు పక్కన పెట్టారు కానీ దేవుడు మాత్రం తన ప్రణాళికలో భద్రపరిచాడు. యోసేపును గోతిలో తోసేసారు దేవుడు సింహాసనం మీదకి ఎక్కించారు, మోషేను నిన్ను మా మీద తీర్పురిగా నియమించిన వాడు ఎవరు అని నిలదీసి భయపెట్టారు, అదే మోషే చేత నిలదీసిన వారిని దేవుడు నడిపించాడు.
అందుకే అపోస్టులోడైన పౌలు గారు తనకోసం పరిచయం చేసుకున్న మాటలలో ప్రభువు యొక్క ఎంపికను ఘనపరిచి తనను తాను పరిచయము చేసుకున్నాడు.
గలతి 1:1
మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,
గుర్తుంచుకుందాం మనుష్యులు ఎంపిక ఈ లోకానుసారముగా ఉంటుంది, దేవుని ఎంపిక ఈ లోకానికి అతీతంగా ఉంటుంది.
1కోరింథీ 1:27 - 29
ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
నాయకులైన వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
పెద్దరికం, డబ్బు, చదువు, హోదా, భయం ఇలాంటి దృక్పదములో ఇతరులకు అవకాశాలు ఇచ్చే బలహీనత మనలో ఉండకూడదు. ఒక వ్యక్తిని సంతోష పెట్టుటకు సంఘమును బాధ పెట్టవద్దు.
నిన్ను నీవు సంతోష పెట్టు కొనుటకు దేవుని చిత్తమును పక్కన పెట్టకు. ఇటువంటి వాటి వలన దేవుని కార్యమును ఆటంకపరుస్తున్నవారు సార్వత్రిక సంఘంలోఎంతోమంది ఉన్నారు.
దైవచిత్తముసారంగా మనమందరము కదులుదుము గాక!



Comments