నీ పరుగు మంచిదైతే...
- oelishabonnke
- Nov 17, 2024
- 1 min read
ఒకసారి ఒక పెద్దాయన రోడ్డు మీద మధ్యాహ్న సమయంలో పరుగెడుతుండగా అక్కడ ఉన్న వారందరూ ఆయన పరుగును ఆశ్చర్యముగా చూస్తూ ఆయన దేనికొరకు పరిగెడుతున్నాడు అని అతని గమ్యం వైపు చూసినప్పుడు, బస్ స్టాపులో ఆగి ఉన్న బస్సును అందుకొనుటకు అతను పరుగెడుతున్నట్టు అందరికీ అర్థం అయింది. అది చూసిన వారందరూ మనసులో అనుకున్నారు ఆ బస్సును అతడు అందుకోవాలి అని. అతని పరుగు మంచి ఉద్దేశంతో కూడిన పరుగు మరియు గురి కలిగిన పరుగు గనుక, అతని యొక్క పరుగును అందరూ ప్రోత్సహించారు.
ఈ జీవిత పరుగులో మనకంటూ దేవుడు ఒక ఉద్దేశమును నిర్దేశించారు. దేవుడు నిర్దేశించిన ఆ గమ్యం వైపు పరుగిడకుండా అర్థం లేకుండా ఉన్న పరుగుకు ప్రోత్సాహము కుటుంబ సభ్యుల నుండి రాదు, సంఘము నుండి రాదు, దేవుని యొద్ద నుండి ఆసలు పొందుకోలేరు.
పరుగు మంచిదైతే ప్రోత్సాహమునకు కొదువ ఉండదు.
నెహెమ్యా యెరూషలేమును బాగు చేయుటకు పరుగును ప్రారంభించాడు, ఆ పరుగును రాజు ప్రోత్సహించాడు, అధికారులు ప్రోత్సహించారు, జనులు ప్రోత్సహించారు అన్నిటికన్నా ముఖ్యముగా దేవుడు ప్రోత్సహించారు.
మంచి పరుగును మంచివారు ప్రోత్సహిస్తారు, దుష్టులు వ్యతిరేకిస్తారు.
దుష్ట పరుగును దుష్టుడు ప్రోత్సహిస్తాడు మంచివాడు వ్యతిరేకిస్తాడు.
నెహమ్యాకు మంచి వారి ప్రోత్సాహము దొరికింది, దుష్టులు ఆటంకపరిచే ఆటంకాలు వచ్చినప్పటికీ.
దైవ చిత్తానుసారముగా మనము గురి కలిగి పరుగెడితే మనకు దేవుడు ఇచ్చే ప్రోత్సాహము చాలా గొప్పగా ఉంటుంది.
సౌలుగా ఉన్న పౌలు దేవునికి వ్యతిరేకముగా పరుగెడుతున్నప్పుడు దమస్కు మార్కములో దేవుడు ఆ పరుపును ఆటంకపరిచాడు. అదే సౌలు పౌలుగా మారి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెడుతన్నప్పుడు (ఫిలిప్పీ 3:14), ప్రభువు పౌలు ప్రక్క నిలిచి(పక్షమున వుండి), బలపరచి, సింహము నోటి వంటి ఆటంకాలు నుండి దేవుడు కాపాడారు.
దైవచిత్తానుసారమైన పరుగునకు దేవుని ఆత్మ సహాయము అందింపబడుతుంది. మన పరుగుకు దైవిక ప్రోత్సాహము కావాలి అంటే, దైవచిత్తానుసారమైన పరుగును మనము కలిగి ఉండాలి.
ఫిలిప్పీయులకు 3:15
కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేని గూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
ఆమెన్


Comments