యేసయ్య ప్రార్థనలో నీవు..
- oelishabonnke
- Nov 16, 2024
- 1 min read
యోహాను సవార్త 17 వ అధ్యాయం యేసు ప్రార్థనతో నిండిన అధ్యాయము.
ఈ అధ్యాయంలో యేసు లోకము కొరకు ప్రార్థన చేయలేదు, మరి ఏ ఇతర విషయాలు కొరకు ప్రార్థన చేయలేదు, ఆయన సంపాదించుకున్న తన వారి కొరకు మాత్రమే ప్రార్థన చేసారు.
యోహాను 17:9
నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు.
ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఇంత భారముతో తన వారి కొరకు ప్రార్థన చేసారో ప్రార్థనలో ఆయన వ్యక్తపరిచిన మాటలలో మనము గమనించగలము.
1) వారు లోక సంబంధులు కారు కాబట్టి లోకము వారిని ద్వేషించును గనుక నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
లోకమందు ఉన్న వ్యతిరేకత ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా ఎరిగియున్న యేసు తన వారి కాపుదల కొరకు ప్రార్థన చేసారు.
యోహాను 17:14 - 16
... నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.
నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి( లేక,కీడునుండి) వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.
నేను లోకసంబంధిని కానట్టువారును లోకసంబంధులు కారు.
2) సత్యమందు వారు ప్రతిష్ట చేయబడాలని, వాక్యమందు స్థిరులై ఉండాలని ప్రార్థన చేసారు.
యోహాను 17:17
సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
3) వారి పరిచర్యలు ద్వారా విశ్వాసం ఉంచువారి కొరకు ప్రార్థన చేసారు.
యోహాను 17:21
వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
4) నేను ఎక్కడ ఉందునో అక్కడ నా వారు ఉండాలని ప్రార్థన చేసారు.
యోహాను 17:24
తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను
గమనించుదము యేసు చేసిన ఈ గొప్ప ప్రార్థనలో మనము కూడా ఉన్నాము.
వారి వాక్యమువలన (ఆయన శిష్యుల వాక్యము వలన) నా యందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. యోహాను 17:21
లోకం మనలను ద్వేషిస్తుంది కానీ యేసు చేసిన ప్రార్థన మనల్ని కాపాడుతుంది.
ఈ గొప్ప ప్రార్ధన చేసిన యేసయ్య ఇప్పటికీ మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట మనకందరికీ పరిచయమే...
హెబ్రీ 7:25
ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
ఆమెన్.
Elisha Bonnke



Comments